
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షల నెరవేర్చుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, అది కేసీఆర్, ఓవైసీ రెండు కుటుంబాల చేతిలో బందీగా మారిపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఈ రెండు కుటుంబాల చేతిలో నుంచి రాష్ట్రాన్ని విడిపించుకోవలసిన అవసరం ఉంది. తెలంగాణ విముక్తి కోసం మళ్ళీ మరో పోరాటం చేయకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి,” అని అన్నారు.
మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, “బండి సంజయ్ అధ్యక్షుడిగా అవడం చాలా సంతోషం. ఒక సామాన్య కార్యకర్త కూడా పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం కేవలం బిజెపిలోనే ఉంది. కానీ ప్రాంతీయ పార్టీలలో కుటుంబపాలన సాగుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వం మజ్లీస్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో పార్టీలో అందరం కలిసికట్టుగా పనిచేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పార్టీని గెలిపించుకొందాము. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడానికి అది తొలిమెట్టు అవుతుంది,” అని అన్నారు.