కేసీఆర్‌ నాతో డిల్లీ వస్తే నిధులు ఇప్పిస్తా: బండి సంజయ్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఎంపికైన బండి సంజయ్ కుమార్ ఆదివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేయడమే నా లక్ష్యం. దాని కోసం రాష్ట్రమంతటా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తాను. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు కేంద్రప్రభుత్వం భారీగా నిధులు అందిస్తోంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లవుతున్నా సిఎం కేసీఆర్‌ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. ఎన్నికల హామీలను అమలుచేయడం లేదు. విద్యావ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలను సిఎం కేసీఆర్‌ నిర్వీర్యం చేశారు. తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ అబద్దాలు చెపుతూ సిఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఒకవేళ కేంద్రం నిధులు ఇవ్వకపోతే సిఎం కేసీఆర్‌ నాతో డిల్లీకి వస్తే నేను ఇప్పిస్తాను. యజ్ఞాలు, యాగాలు చేస్తున్న నా కంటే గొప్ప హిందువు ఎవడున్నాడని సిఎం కేసీఆర్‌ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసమే అవన్నీ చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ చేతిలో రాష్ట్రం బందీ అయిపోయింది. ఆయన మజ్లీస్ అధినేతల కనుసన్నలలో పనిచేస్తుంటారు. రాష్ట్రంలో ఈ రెండు కుటుంబాల పాలనను అంతమొందించడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతాను. తెలంగాణలో బిజెపిని అధికారంలో తేవడమే నా లక్ష్యం,” అని అన్నారు.