
కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, యూనివర్సిటీలను ఈనెలాఖరువరకు మూసివేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్, జూపార్కులు, సాంస్కృతిక ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, జాతరలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలపై కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఇప్పటికే నిశ్చయమైన పెళ్ళిళ్ళు, శుభకార్యాలలో 200 మందికి మించరాదని సూచించారు. మార్చి 31 తరువాత పెళ్ళిళ్ళు, ఇతర కార్యక్రమాలను కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలని సిఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తరువాత ఫంక్షన్ హాల్స్ అద్దెకు ఇవ్వరాదని సిఎం కేసీఆర్ ఆదేశించారు. పది రోజుల తరువాత మళ్ళీ పరిస్థితులను సమీక్షించిన తరువాత తదుపరి నిర్ణయాలు ప్రకటిస్తామని చెప్పారు.
బస్సులు, మెట్రో రైళ్లు యధావిధిగా తిరుగుతాయని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని షాపింగ్ మాల్స్ పై ఎటువంటి ఆంక్షలు విధించడంలేదని తెలిపారు.
కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకొంటోందని కనుక ప్రజలు, మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభుత్వానికి సహకరించాలని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ గురించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో గానీ తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారం చేస్తే కటినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం, చట్టం అంటే ఏమిటో రుచి చూపిస్తామని సిఎం కేసీఆర్ హెచ్చరించారు.