
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలను మార్చి నెలాఖరువరకు మూసివేయాలని సిఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. అలాగే శాసనసభ, మండలి సమావేశాలను కూడా సోమవారంతో ముగించాలని నిర్ణయించారు. కొద్ది సేపటి క్రితం మొదలైన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయగానే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కరోనా దెబ్బకు తెలుగు సినీపరిశ్రమ, వ్యాపారవాణిజ్య సంస్థలు మూసుకోవలసివస్తే తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ఈ నెలాఖరు వరకు అన్నిటినీ మూసివేసినప్పటికీ, కరోనా మహమ్మారి అంతటితో ఆగిపోదు కనుక ఇంకా ఎంతకాలం అన్ని మూసుకొని కూర్చోవాలో తెలీని పరిస్థితులు నెలకొని ఉండటంతో సినీ, వ్యాపార రంగాలలోవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సినిమా ధియేటర్లు మూతపడితే సినిమా రిలీజులు ఆగిపోతాయి. తీసిన సినిమాలు సకాలంలో రిలీజ్ కాకపోతే ఆ నిర్మాతలు, ఫైనాన్షియర్లు నష్టపోతారు. సినిమా షూటింగులు కూడా నిలిచిపోతాయి. దాంతో సినీ పరిశ్రమలో పనిచేస్తున్నవారు రోడ్డున పడతారు.
షాపింగ్ మాల్స్ మూతపడితే వాటిలో పనిచేసేవారు, షాపింగ్ మాల్స్ కు వివిద వస్తువులు సరఫరా చేస్తున్న సంస్థలు నష్టపోతాయి. కనుక వాటిలో పనిచేస్తున్న వారు రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది. అంటే పైకి కనబడని సామాజిక విధ్వంసం జరుగబోతోందన్న మాట!
కరోనా వైరస్ 27 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలో జీవించలేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు కనుక వేసవి ఎండల తీవ్రత పెరగగానే కరోనా వైరస్ పూర్తిగా నశించిపోవచ్చునని ఆశిద్దాం. కనుక ఈసారి ఎండలు మండిపోవాలని అందరూ కోరుకోవాలేమో?