పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదు: కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో మాట్లాడుతూ, “ఆస్తిపన్నులు, విద్యుత్ ఛార్జీలను పెంచక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం, విద్యుత్ సంస్థలను కాపాడుకోవడం కోసం ప్రజలపై కొంత ఆర్ధికభారం మోపవలసివస్తోంది. వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తూ మనకు సేవలందించాలంటే వాటిని మనం కాపాడుకోవలసిన అవసరం ఉంది. కానీ పేదలపై భారం మోపకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటాము. పన్నులు, అదనపు విద్యుత్ ఛార్జీలు చెల్లించగలవారికే ఈ పెంపును వర్తింపజేస్తాము. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలందరూ ఈ ఛార్జీల పెంపుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలను శాసనసభ ద్వారా ప్రజలకు వివరించారు. గ్రామాలు కూడా స్వయంగా ఆదాయం సమకూర్చుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా, ప్రజాసమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించినా వారిని పదవులలో నుంచి తొలగించడానికి వెనుకాడబోమని సిఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.