
మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ బహిరంగసభలో అసదుద్దీన్ ఓవైసీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వివాదాస్పదవ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఇంక్విలాబ్ మిలత్ పార్టీ నేత బాలకిషన్ రావు నాంపల్లి కోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, అసదుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించడంతో పాతబస్తీ మొగల్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఆయనాపి సెక్షన్స్ 153, 153(ఏ), 117, 295(ఏ), 120(బీ) కింద కేసు నమోదు చేశారు.
సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఏలను రాజకీయ మైలేజీకి పనికొచ్చే అంశంగానే అధికార ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కానీ వాటితో చెలగాటం ఆడితే ఎంత తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో డిల్లీలో జరిగిన విధ్వంసం, హత్యాకాండ చూస్తే అర్ధం అవుతుంది. కనుక అధికార, ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఏల వలన కలిగే లాభనష్టాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వారు వాదనలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు. అటువంటి చర్యల వలన దేశంలో అరాచకం ఏర్పడుతుంది. కనుక అధికార, ప్రతిపక్షాలు ఈ మూడు అంశాలపై చాలా సంయమనంతో వ్యవహరించవలసిన అవసరం చాలా ఉంది.