హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌ రెడ్డి

గండిపేటలో మంత్రి కేటీఆర్‌ ఫాంహౌసుపై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించినందుకు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి మియాపూర్ కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వడానికి మియాపూర్ కోర్టు నిరాకరించడంతో ఆయన తరపు న్యాయవాది ఈరోజు హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు వేశారు. ఒకటి బెయిల్ కోసం. రెండవది తన రిమాండును రద్దు చేయాలని. మూడవది నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్లు వేశారు. 

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో  పార్లమెంటు సభ్యుడినైన తనను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం సరికాదని రేవంత్‌ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. కనుక తనపై పెట్టిన అక్రమకేసులను కొట్టివేసి జైలు నుంచి విడుదల చేయాలని రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్ధించారు. వాటిపై ఈరోజు భోజన విరామం తరువాత లేదా రేపు ఉదయం విచారణ జరిగే అవకాశం ఉంది.