టిఎస్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

టిఎస్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త! వారి సమ్మె కాలానికి సంబందించి వేతనాలను ఆర్ధికశాఖ బుదవారం విడుదల చేసింది. ఆర్టీసీ సమ్మె సమయంలో వారి పట్ల చాలా కటినంగా వ్యవహరించిన సిఎం కేసీఆర్‌, ఆ తరువాత వారికి 55 రోజుల సమ్మె కాలానికి కూడా జీతాలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులందరూ విధులలో చేరారు కానీ ఆర్ధిక సమస్యల కారణంగా ప్రభుత్వం ఇంతవరకు వారికి సమ్మె కాలానికి జీతం చెల్లించలేకపోయింది. సమ్మెకాలంలో జీతాలు అందక దొరికిన చోటల్లా అప్పులు చేసి చితికిపోయిన ఆర్టీసీ కార్మికులు దీనికోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ధికశాఖ ఈరోజు రూ.235 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఒకటి రెండు రోజులలోనే వారి బ్యాంక్ ఖాతాలలోకి ఆ సొమ్ము జమా అయ్యే అవకాశం ఉంది.