కెకె, పొంగులేటికే రాజ్యసభసీట్లు ఖరారు?

రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు సిట్టింగ్ ఎంపీ కె. కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు ఖరారు చేసినట్లు తాజా సమాచారం. దీనిపై ఈరోజు టిఆర్ఎస్‌ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండు సీట్లలో ఒకటి మాజీ ఎంపీ కవితకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఆమెను పక్కన పెట్టి మళ్ళీ కె.కేశవరావునే రాజ్యసభకు పంపించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించడం ఆశ్చర్యకరమే. ఒకవేళ ఆమెకు సిఎం కేసీఆర్‌ రాజ్యసభకు పంపించకపోతే రానున్న రోజులలో ఆమెకు కీలకపదవీ బాధ్యతలు అప్పగించవచ్చు. 

స్థానిక సంస్థల కోటాలో నిజామాబాద్‌ శాసనమండలి అభ్యర్ధిగా శాసనసభ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి పేరు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. సిఎం కార్యాలయంలో ఆఫీసర్ ఆన్‌ స్పెషల్ డ్యూటీగా విధులు నిర్వర్తిస్తున్న దేశపతి శ్రీనివాస్‌ను గవర్నర్‌ కోటాలో మండలి అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు సమాచారం.