
ఖమ్మం అస్సిస్టెంట్ లేబర్ కమీషనర్ ఆనందరెడ్డి భూపాలపల్లిలో ఓ టిఆర్ఎస్ నేతను కలిసేందుకు వెళ్ళి అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జనగామకు చెందిన ఆనందరెడ్డికి టిఆర్ఎస్ నేత పింగళి ప్రదీప్ రెడ్డితో ఆర్ధికలావాదేవీలున్నాయి. ఆయన ప్రదీప్ రెడ్డికి రూ.80 లక్షలు అప్పు ఇచ్చినట్లు ఆయన సోదరుడు శివకుమార్ రెడ్డి చెప్పారు.
మార్చి 8న ఆనంద్ రెడ్డి తనకు ఫోన్ చేసి, ప్రదీప్ రెడ్డి వద్ద డబ్బు తీసుకొనేందుకు వెళుతున్నానని, అక్కడి నుంచి అతనితో కలిసి భూపాలపల్లిలో నడికుడి వద్ద భూములు చూసేందుకు వెళుతున్నానని చెప్పారని శివకుమార్ రెడ్డి చెప్పారు. కానీ ఆ రోజు రాత్రికి ఆనందరెడ్డి ఇంటికి చేరుకోకపోవడంతో వెంటనే హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని 8 పోలీసు బృందాలతో ఆనందరెడ్డి, ప్రదీప్ రెడ్డిల కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఆనందరెడ్డి, ప్రదీప్ రెడ్డిల ఫోన్ కాల్స్ ఆధారంగా వారిరువురూ చివరిసారిగా భూపాలపల్లి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఒక పోలీస్ బృందం ఆ ప్రాంతంలో గాలిస్తుండగా, ప్రదీప్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో మరో పోలీసుల బృందం వెంటనే అక్కడకు చేరుకొని అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇంతకీ ప్రదీప్ రెడ్డిని కలిసిన తరువాత ఆనందరెడ్డి ఎందుకు అదృశ్యమయ్యారు? తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసినా ప్రదీప్ రెడ్డి వారిని కలిసేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు.