
సాధారణంగా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లను తప్పుపడుతూ ప్రతిపక్షాలు విమర్శించడం, అప్పుడు అధికార పార్టీలు తమ బడ్జెట్‌ను సమర్ధించుకొంటూ ప్రతిపక్షాలపై తిరిగి విమర్శలు చేస్తుంటాయి. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌పై కూడా అదే జరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్, బిజెపిలు చేసిన విమర్శలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిప్పికొడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ బీసీ అయినప్పటికీ దేశంలో బీసీల సంక్షేమం కోసం చేసిందేమీ లేదు. కానీ సిఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. ఎస్సీఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం బారీగా నిధులు కేటాయించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. కనుక బడ్జెట్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజానికి బీసీ సంక్షేమం పట్ల సిఎం కేసీఆర్ ప్రత్యేకశ్రద్ద వహిస్తున్నందునే కె.లక్ష్మణ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు,” అని ఎద్దేవా చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ ఆర్ధికమాంద్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిజంగా ఓ అద్భుతం. ఇటువంటి పరిస్థితులలో కూడా రైతుబంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పధకాలన్నిటికీ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్రంలో పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశ్యంతోనే సిఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పధకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాలకు సిఎం కేసీఆర్, కేటీఆర్‌లు రాజకీయంగా సామాజికంగా న్యాయం చేస్తూ సమానావకాశాలు కల్పిస్తున్నారు. కాంగ్రెస్, బిజెపిలు బడుగుబలహీన వర్గాలకు చేసిందేమీ లేకపోయినా, ఇన్ని చేస్తున్న సిఎం కేసీఆర్‌పై నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. వారు మీడియా దగ్గరకు వెళ్ళి మాట్లాడేబదులు శాసనసభలో మాట్లాడితే బాగుంటుంది,” అని అన్నారు.