2.jpg)
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై స్పందిస్తూ, “ఇది అంకెల గారడీ బడ్జెట్. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు బడ్జెట్‌లో చూపించారు. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని గొప్పలు చెప్పిన ప్రభుత్వం రాష్ట్రానికి మొత్తం ఎంత రుణభారం ఉందో ఎందుకు చెప్పలేదు? రాష్ట్రంలో ప్రతీ ఒక్కరిపై రూ.91,000 రుణభారం మోపిన ఘనత సిఎం కేసీఆర్‌దే. బడ్జెట్ బారెడు...ఖర్చు చారెడు..అన్నట్లుంది. దీని వలన రాష్ట్రానికి...ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని, పేద ప్రజలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తామని చెప్పారు. కానీ బడ్జెట్‌లో వాటి ప్రస్తావన లేదు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నందునే ఇప్పుడు హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.10,000 కోట్లు కేటాయించారు. సిఎం కేసీఆర్ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసమే ఆర్ధికమాంద్యమని, కేంద్రం నిధులు విడుదల చేయడంలేదని అబద్దాలు చెపుతున్నారు. నగరంలో విలువైన భూములు అయినకాడికి అమ్మేసుకొంటూ నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
కరోనా వైరస్‌కు పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందని సిఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయనేమైనా డాక్టరా ఏ రోగానికి ఏ మందులు వేసుకోవాలో చెప్పడానికి? సిఎం కేసీఆర్ మజ్లీస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికే సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయడానికి సిద్దపడుతున్నారు,” అని అన్నారు.