నిరుద్యోగభృతి హామీ అటకెక్కినట్లేనా?

డిసెంబర్ 2018లో జరిగిన ముందస్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, ‘కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగులందరికీ ఒక్కక్కరికీ నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని’ హామీ ఇచ్చింది. మొదట అది ఆచరణ సాధ్యం కాదని టిఆర్ఎస్‌ కొట్టిపడేసినా, ఆ తరువాత తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది.  

దాని కోసం గత బడ్జెట్‌లో రూ.1,810 కోట్లు కేటాయించడంతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం తప్పకుండా ఆ హామీని అమలుచేస్తుందని నిరుద్యోగులందరూ ఆశగా ఎదురుచూశారు కానీ అమలుచేయలేదు. ఈఏడాది కూడా ఆ హామీని అమలుచేయలేమని సిఎం కేసీఆర్‌ ఇటీవల శాసనసభలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో దాని కోసం నిధులు కూడా కేటాయించలేదు కనుక ఇక దాని గురించి ఎదురుచూడవలసిన అవసరం కూడా లేదని స్పష్టం అవుతోంది. 

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వవ్వద్దని ఎమ్మెల్యేలకు, మునిసిపల్ చైర్మన్లకు పదేపదే చెప్పే సిఎం కేసీఆర్‌, ఎన్నికలప్పుడే ఇది ఆచరణ సాధ్యం కాదని గ్రహించినప్పటికీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చేక ఇప్పుడు దానిని అటకెక్కించేశారు. 

ఒకప్పుడు రాజకీయపార్టీల హామీలను ప్రజలు కూడా సీరియస్‌గా తీసుకొనేవారు కారు కనుక నోటికి వచ్చిన హామీలను గుప్పించేవారు. కానీ ఇప్పుడు ప్రజలలో రాజకీయ చైతన్యం చాలా పెరిగినందున హామీల విషయంలో ప్రజలను మభ్యపెట్టాలని చూసినా లేదా మాట తప్పినా సదరు నేతలు విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా ప్రతిపక్షాలు దానిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొనే అవకాశం కూడా కల్పించినట్లవుతుంది. కానీ హామీలు అమలు చేయకపోయినా ప్రజలు మావైపే ఉన్నారనుకొంటూ ముందుకు సాగితే అంతిమంగా నష్టపోయేది ఆ పార్టీలే తప్ప ప్రజలు కాదని మరిచిపోకూడదు.