
ఈరోజు శాసనసభలో సిఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. “తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పాను తప్ప ఇంటికో ఉద్యోగం వస్తుందని నేను ఎన్నడూ అనలేదు. ఆ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం కోటిమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది సాధ్యమేనా? అని అందరూ ఆలోచించాలి. అందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పిస్తామని యువతను మభ్యపెట్టడం మానుకోవాలి. ఎందుకంటే ఏ దేశంలో ఏ ప్రభుత్వానికి అది సాధ్యం కాదు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ ఆరేళ్ళలో సుమారు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశాము.
ప్రభుత్వ రంగంలో రైల్వేలు, బ్యాంకింగ్, రక్షణ రంగాలలో భారీగా ఉద్యోగావకాశాలున్నాయి. కానీ వాటిపై యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు వచ్చాయి. వాటి ద్వారా రాష్ట్రంలో లక్షలాదిమంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఒక్క ఐటి రంగంలోనే సుమారు 7.5 లక్షల మంది పనిచేస్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం ద్వారా కూడా లక్షలమంది ఉద్యోగ ఉపాది అవకాశాలు పొందుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉద్యోగావకాశాలున్నాయి. తెలంగాణలో నెలకు కనీసం రూ.6,000 సంపాదించుకొనే అవకాశాలుండగా నేటికీ అనేకమంది రూ.10,000 జీతం కోసం ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెళుతున్నారు. కనుక ఉద్యోగావకాశాల గురించి యువతకు తెలియజేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాము,” అని అన్నారు.