కేటీఆర్‌ సార్ నాకు న్యాయం చేయండి: రాహుల్

ఇటీవల హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతంలో ఓ పబ్బులో జరిగిన గొడవలో గాయపడిన బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లీగంజ్, ఇంస్టాగ్రామ్ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి ఆవిషయం తీసుకువెళ్లి తనకు న్యాయం చేయవలసిందిగా కోరారు. “ఆరోజు పబ్బులో ఎమ్మెల్యే సోదరుడు (రితేష్ రెడ్డి) అతని అనుచరులు నాపై దాడి చేశారు. ఆ వీడియోను మీకూ పంపిస్తున్నాను. దానిని చూసి మీరే ఎవరిది తప్పో నిర్ణయించండి. ఒకవేళ నాది తప్పని మీరు భావిస్తే ఏ శిక్షకైనా నేను సిద్దం. అదేవిధంగా ఎమ్మెల్యే సోదరుడిది తప్పని భావిస్తే తక్షణం అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణలో పుట్టిన నేను రాష్ట్రం కోసం, టిఆర్ఎస్‌ కోసం చివరి వరకు పోరాడుతాను. మన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడే ఈవిధంగా బహిరంగ ప్రదేశాలలో అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. కనుక మా అందరికీ నాయకుడైన మీరు దీనిపై తగిన చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నాను. రాష్ట్రంలోని ఒక సామాన్య పౌరుడిగా నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను,” అంటూ మంత్రి కేటీఆర్‌కు రాహుల్ సిప్లీగంజ్ మెసేజ్ పంపారు.