
రాజ్యసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించబోతున్న శాసనసభ కార్యదర్శి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఈనెల 13వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 16న నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 18. మార్చి 26న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆదేరోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకొంటారు కనుక సరిపడినంతమంది ఎమ్మెల్యేలు లేనికారణంగా కాంగ్రెస్, బిజెపిలు అభ్యర్ధులను నిలబెట్టలేని స్థితిలో ఉన్నాయి. కనుక ఈ ఎన్నికలు కూడా టిఆర్ఎస్‌కు ఏకపక్షమే... లాంఛనప్రాయమే. సిఎం కేసీఆర్ ఎవరిని అభ్యర్ధులుగా ఎంపిక చేస్తే వారే రాజ్యసభ సభ్యులవుతారు. రెంటిలో ఒక సీటును మాజీ ఎంపీ కవితకు కేటాయించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కనుక మిగిలిన ఒక్క సీటు కోసం రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేయనున్న కె. కేశవరావుతో సహా టిఆర్ఎస్‌లో పలువురు పోటీ పడుతున్నారు. వారిలో మాజీ ఎంపీలు సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎస్సీ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే కడియం శ్రీహరికి, ఎస్టీకైతే సీతారాం నాయక్ ఇచ్చే అవకాశం ఉంది. వారికి కాదనుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది కనుక ఆ ముగ్గురిలో ఎవరికి అవకాశం లభిస్తుందో త్వరలోనే తేలిపోతుంది.