మార్చి 8న రాష్ట్ర బడ్జెట్‌

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలిసారిగా శాసనసభలో ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించారు. సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, అందుకే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఆర్ధికమాంద్యం ప్రభావం కనబడుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలను అమలుచేస్తోందని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తన ప్రసంగంలో వివరించారు.       

అనంతరం శాసనసభ సమావేశాలు ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు శాసనసభ ఆవరణలో జరిగిన బీఏసీ సమావేశంలో శాసనసభ షెడ్యూల్, అజెండాలను ఖరారు చేశారు.  

ఈనెల 9,10,15 తేదీలు మినహా మొత్తం 12 రోజులు అంటే మార్చి 20 వరకు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఆర్ధికమంత్రి హరీష్‌రావు ఆదివారం ఉదయం శాసనసభలో 2020-21లకు రాష్ట్ర ఆర్ధిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 

రాష్ట్రంలో ఆర్ధికమాంద్యం ప్రభావం కనబడటం లేదని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పినప్పటికీ ఆ ప్రభావం ఎంతో కొంత ఉందని అందరికీ తెలుసు. పైగా జిఎస్టీలో రాష్ట్రానికి రావలసిన నిధుల వాటాలో కేంద్రం కోత విధించడం, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వలన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కనుక నిధుల కొరతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ప్రజలపై పన్నుల భారం మోపకుండా బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సరిపడినన్ని నిధులు కేటాయించడం ఆర్ధికమంత్రి హరీష్‌రావుకు కత్తిమీద సాము వంటిదేనని చెప్పవచ్చు.