నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ

నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. మళ్ళీ రేపు ఉదయం శాసనసభ సమావేశమయినప్పుడు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలవుతుంది. ఆర్ధికమంత్రి హరీష్‌రావు ఆదివారం ఉదయం శాసనసభలో 2020-2021 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టె అవకాశం ఉంది. హోళీ పండుగ సందర్భంగా శాసనసభకు సోమ, మంగళవారాలు శలవు ఉంటుంది. బుదవారం నుంచి ఈ నెల 22 వరకు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తరువాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. దానిలో శాసనసభలో చర్చించవలసిన అంశాల అజెండా, పనిదినాల షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఈసారి శలవులు పోగా 10-12 రోజులు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. శాసనసభ మండలి సమావేశాలు కేవలం 4-5 రోజులు మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. 

ఈరోజు ఉదయం శాసనసభ, మండలి సభ్యులు అందరూ ఉదయం 10.30 గంటలకు గన్‌పార్క్‌ వద్దకు వెళ్ళి అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత శాసనసభకు చేరుకొంటారు. ఈసారి శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనుంది. కొత్త రెవెన్యూ చట్టానికి సబందించి బిల్లును ఆమోదించనుంది.