జగిత్యాల నుంచి వెనుతిరిగిన కశ్మీర్‌ పోలీసులు

జగిత్యాల జిల్లాలో మల్లాపూర్ మండలంలోని కూస్తాపూర్ గ్రామానికి చెందిన సరికెళ్ళ లింగన్న అనే రైతును అదుపులో తీసుకోవడానికి వచ్చిన కశ్మీర్‌ పోలీసులు అందుకు కోర్టు అనుమతించకపోవడంతో మంగళవారం వెనుతిరిగారు. కశ్మీర్‌ పోలీసులు తెలిపినదాని ప్రకారం, కశ్మీర్‌లో అర్నియా అనే ప్రాంతంలో ఆర్మీక్యాంపులో రాకేశ్ కుమార్ అనే వ్యక్తి కూలిగా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఓ మహిళా పాకిస్తాన్ గూడఛారి ఉచ్చులో చిక్కుకొన్న అతను, తను పనిచేస్తున్న సైనిక స్థావరానికి సంబందించి కొన్ని విషయాలను ఆమెకు చెప్పినట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. దాంతో కశ్మీర్‌ పోలీసులు అతనిని ఈ ఏడాది జనవరి 5న అరెస్ట్ చేశారు. వారు అతనికి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించగా సరికెళ్ళ లింగన్న బ్యాంక్ అకౌంట్ నుంచి అతనికి ఆన్‌లైన్‌ ద్వారా ఫిబ్రవరి 13న రూ.5,000 మళ్ళీ ఫిబ్రవరి 25న రూ.4,000 నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. గూడచర్యానికి పాల్పడుతున్న రాకేశ్ కుమార్‌కు లింగన్న ఆర్ధిక సహకారం అందిస్తున్నాడని భావించిన కశ్మీర్‌ పోలీసులు, అతనిని అదుపులో తీసుకొనేందుకు సోమవారం జగిత్యాల జిల్లాకు వచ్చారు.

లింగన్నను అరెస్ట్ చేయడానికి కశ్మీర్‌ నుంచి పోలీసులు వచ్చారని తెలియడంతో కూస్తాపూర్ గ్రామంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. మల్లాపూర్ పోలీసులు వారికి సమస్యను వివరించడంతో వారు పోలీసులకు సహకరించి లింగన్నను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్ళేందుకు అంగీకరించారు. స్థానిక పోలీసుల సహకారంతో లింగన్నను పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నించినప్పుడు, రాకేశ్ కుమార్ ఎవరో తనకు తెలియదని, అసలు ఏనాడూ అతనికి డబ్బు పంపించలేదని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో ఉంటున్న తన బందువు శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు పంపించానని, కానీ రాకేశ్ కుమార్‌కు తన ఖాతాలో నుంచి డబ్బు వెళ్ళిన సంగతి కూడా తనకు తెలియదని లింగన్న చెప్పాడు. 

కనుక ఈ వ్యవహారం గురించి మరింత లోతుగా ప్రశ్నించేందుకు కశ్మీర్‌ పోలీసులు లింగన్నను మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచి అతని కస్టడీ కోరగా సరైన సాక్ష్యాధారాలు లేనందున కోర్టు వారి అభ్యర్ధనను తిరస్కరించింది. దాంతో వారు మంగళవారం కశ్మీర్‌కు తిరిగి వెళ్ళిపోయారు.