సిఎం కేసీఆర్‌ నుంచి నాకు ప్రాణహాని: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ సిఎం కేసీఆర్‌, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ పారిశ్రామికవేత్త నుంచి తనకు ప్రాణహాని ఉందని కనుక తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనకు కేంద్ర రక్షణ దళాలు లేదా స్వతంత్ర ఏజన్సీల నుంచి 4+4 గన్‌మెన్‌లతో భద్రత మరియు ఎస్క్కార్ట్ సౌకర్యం కూడా కల్పించాలని రేవంత్‌ రెడ్డి పిటిషన్‌లో కోరారు. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్రహోంశాఖకు నోటీసు పంపింది. ఈ కేసుపై ఆరు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 

రేవంత్‌ రెడ్డి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ వేయడం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. ఆయన నిజంగానే కేసీఆర్‌ నుంచి ప్రాణహాని ఉందని భావిస్తున్నారో లేదా ముఖ్యమంత్రి గౌరవాన్ని విశ్వసనీయతను దెబ్బ తీసేందుకే ఆయన పేరును పిటిషన్‌లో పేర్కొన్నారో తెలియదు. ఒకవేళ రేవంత్‌ రెడ్డి పిటిషన్‌లో సిఎం కేసీఆర్‌ పేరు పేర్కొనడం వాస్తవమే అయితే దానిపై న్యాయస్థానం అభ్యంతరం చెప్పకుండా విచారణకు స్వీకరించడం కూడా ఆశ్చర్యకరమే.