కేటీఆర్‌పై రేవంత్‌ రెడ్డి బురదజల్లుతున్నారు: బాల్క సుమన్

మంత్రి కేటీఆర్‌ అక్రమంగా నిబందనలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ శివార్లలో గండిపేట వద్ద 25 ఎకరాలలో ఫామ్ హౌస్ నిర్మించుకొంటున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలను టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. సుమన్ నిన్న తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “గోపన్‌పల్లిలో దళితుల భూములను కబ్జా చేసిన రేవంత్‌ రెడ్డి సోదరులు, తమపై విచారణ మొదలవడంతో మంత్రి కేటీఆర్‌పై బురదజల్లి తన తప్పులను కప్పి పుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికలలో కేటీఆర్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనే గండిపేట వద్ద 8 ఎకరాల 9 గుంతల భూమిని తన భార్య పేరిట లీజుకు తీసుకొన్నామని కేటీఆర్‌ స్పష్టంగా పేర్కొన్నారు. కబ్జాలు, బ్లాక్ మెయిల్‌కు అలవాటుపడిన రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌ను కూడా బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మా నాయకుడు కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రేవంత్‌ రెడ్డి తక్షణమే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి,” అని అన్నారు.