
డిల్లీ అల్లర్లలో సుమారు 48 మంది మరణించగా, సుమారు 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తినష్టం జరిగింది. వాటిపై మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.
మజ్లీస్ పార్టీ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని దారుసల్లామ్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ, “డిల్లీ అల్లర్లలో ఇంతమంది పౌరులు చనిపోతున్నా ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పి మాట్లాడటం లేదు. పక్కనే అంతమంది చనిపోతున్నా ప్రధాని నరేంద్రమోడీ హాయిగా ఎలా నిద్రపొగలుగుతున్నారో నాకు అర్ధం కావడంలేదు. డిల్లీ అల్లర్లకు పూర్తి బాధ్యత కేంద్రప్రభుత్వమే వహించాలి. అవి ఖచ్చితంగా కుట్రేనని నేను నమ్ముతున్నాను. వాటి వెనుక ఎవరున్నారో తేల్చాల్సింది కేంద్రప్రభుత్వమే. డిల్లీ అల్లర్లలో దారుణంగా హత్యకు గురైన మహమ్మద్ జూబైర్ చిత్రాలను ఐసిస్ తీవ్రవాదసంస్థ కూడా వినియోగించుకోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఆ ఫోటోలను చూపి దేశ ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగోట్టేందుకు ఐసిస్ ప్రయత్నిస్తోంది. కనుక కేంద్రప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ అల్లర్లను అదుపుచేసి, వాటి వెనుకున్నవారిని పట్టుకొని చట్టప్రకారం శిక్షలు పడేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డిల్లీ అల్లర్లపై లోక్‌సభలో కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తాను,” అని అన్నారు.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు (సీఏఏ)ను వ్యతిరేకించిన టిఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్‌పిఆర్ అమలుకు కూడా అనుమతించకూడదని అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. సీఏఏ, ఎన్‌పిఆర్‌లను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి అసదుద్దీన్ ఓవైసీ సిఎం ఈ సందర్భంగా కేసీఆర్‌కు చేశారు.