భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామం సమీపంలో భారీగా ప్రేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. శనివారం మధ్యాహ్నం పాల్వంచ రూరల్ ఎస్ఐ కె శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు రోడ్డుపై వెళ్ళే వాహనాలను తనికీలు చేస్తున్న సమయంలో ఒక టాటా ఏస్ వాహనం, దాని ముందు రెండు బైక్స్ పై ఆరుగురు వ్యక్తులు వస్తున్నారు. వారిలో ఒకరు పోలీసులను చూసి బైక్‌పై నుంచి దూకి పారిపోయాడు. దాంతో అనుమానం వచ్చి పోలీసులు మిగిలిన ఐదుగురిని అదుపులో తీసుకొని, టాటా ఏస్ వాహనం నిలిపి తనికీలు చేయగా దానిలో 40 జిలెటిన్ స్టిక్స్, 40 డిటనేటర్లు, 27 బ్లాస్ట్ బూస్టర్లు నీటుగా బాక్సులలో ప్యాక్ చేసి లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని, వాహనాన్ని, ఆ ఐదుగురు వ్యక్తులను పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
పట్టుబడినవారిలో పి సారయ్య (నిమ్మలగూడెం, ఛత్తీస్ ఘడ్), కె. మురళి, కె.నాగేశ్వర్ రావు (దబ్బనూతల, దుమ్ముగూడెం మండలం), కె. సమ్మయ్య (వీరభద్రపురం దుమ్ముగూడెం మండలం), జె. హనుమంతు (తొగ్గూడెం, పాల్వంచ మండలం) ఉన్నారు. వారిని పోలీసులు ప్రశ్నించగా తాము రాష్ట్ర మావోయిస్టు నేతలు హరిభూషన్, దామోదర్, లచ్చన్న, ఆజాద్ మరియు రవిల ఆదేశాల మేరకు మావోయిస్టులకు అందించేందుకు వాటిని తీసుకువెళుతున్నట్లు తెలిపారు.
స్థానిక క్రషర్ కంపెనీలు కొండలను, బండరాళ్ళను పగులగొట్టేందుకు ఆ ప్రేలుడు పదార్ధాలను వినియోగిస్తుంటాయి. అక్కడి నుంచే వాటిని సేకరించామని పట్టుబడినవారు చెప్పడంతో, పోలీసులు బృందాలు ఒకే సమయంలో జగన్నాథపురంలోని శ్రీ వెంగమాంబ క్రషర్ మిల్, తొగ్గూడెంలోని విఎస్ఐ క్రషర్ మిల్, జూలూరిపాడులో గల టిసిఎంఎం క్రషర్ మిల్, చుంచుపల్లిలోగల శ్రీ గణేశ్ క్రషర్ మిల్, కొత్తగూడెంలోగల కెఆర్కె క్రషర్ మిల్స్ లో తనికీలు చేయగా వాటికి అనుమతించినవాటి కంటే చాలా భారీగా ప్రేలుడు సామాగ్రి లభించింది. మొత్తం 2170 జిలెటిన్ స్టిక్స్, 1428 డిటోనేటర్లు, 2,632 బ్లాస్ట్ బూస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకొని, అక్రమంగా పరిమితికి మించి ప్రేలుడు పదార్ధాలను నిలవ ఉంచినందుకు, వాటిని మావోయిస్టులకు అమ్ముతున్నందుకు క్రషర్ మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు.