ఇల్లెందు మునిసిపల్ ఛైర్మన్‌కు కేటీఆర్‌ లక్ష జరిమానా

మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఖమ్మం నగరంలో, ఇల్లెందు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం చెపుతూ టిఆర్ఎస్‌ నేతలు ఎక్కడికక్కడ అనేక ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిని చూసి తీవ్ర అసహనానికి గురైన మంత్రి కేటీఆర్‌, వాటిని పెట్టించిన ఇల్లెందు మునిసిపల్ ఛైర్మన్‌ దమ్మాలపాటి వేంకటేశ్వర రావుకు, అలాగే ఖమ్మం నగర టిఆర్ఎస్‌ అధ్యక్షుడు, శాంతినగర్ కార్పొరేటర్‌ కమర్తపు మురళికి చెరో లక్ష జరిమానా విధించారు. వారిరువురి దగ్గర నుంచి ఆ జరిమానా సొమ్మును వసూలు చేయాలని జిల్లా కలక్టరు ఎంవీ రెడ్డిని ఆదేశించారు. 

తన పర్యటనలు, సభలు సమావేశాల సందర్భంగా ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటుచేయవద్దని మంత్రి కేటీఆర్‌ గత 5 ఏళ్లుగా చెపుతూనే ఉన్నారు. కానీ కేటీఆర్‌ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు భారీగా ఏర్పాటుచేసి ఘనస్వాగతం పలికినట్లయితే  ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చనే ఆలోచనతో టిఆర్ఎస్‌ నేతలు ఆయన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ బ్యానర్లు పెడుతున్నారు. మంత్రి కేటీఆర్‌ వారిని సున్నితంగా హెచ్చరిస్తున్నయ వారి తీరు మారలేదు. అందుకే మంత్రి కేటీఆర్‌ ఖమ్మం టిఆర్ఎస్‌ నేతల పట్ల ఈసారి కాస్త కటినంగా వ్యవహరించారు. కొత్తగా ఎన్నికైన మునిసిపల్ వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అలసత్వం ప్రదర్శిస్తే కొత్త మునిసిపల్ చట్టం ప్రకారం పదవులు పోగొట్టుకొంటారని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.