కేసీఆర్‌ పులిమీద స్వారీ చేస్తున్నారు: లక్ష్మణ్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సీఏఏ వ్యతిరేకత పేరుతో రాజకీయాలు చేయడం తగదు. సిఎం కేసీఆర్‌ మతతత్వ మజ్లీస్ పార్టీతో దోస్తీ చేయడం పులిమీద సవారీ చేయడం వంటిదే. దేశ భద్రత, సమగ్రత కోసం కేంద్రప్రభుత్వం సీఏఏను తీసుకువస్తే, మజ్లీస్ పార్టీ దానిని వ్యతిరేకిస్తూ ప్రజల మద్య విద్వేషాలు రాజేస్తోంది. అటువంటి మజ్లీస్ పార్టీతో సిఎం కేసీఆర్‌ దోస్తీ చేయడం సరికాదు. పాముకు పాలు పోసి పెంచితే అది ఏదో ఓ రోజు కాటేయక మానదు. అలాగే మజ్లీస్ పార్టీని పెంచిపోషిస్తే అది ఏదో రోజు టిఆర్ఎస్‌ను ముంచడం ఖాయం. దేశభవిష్యత్, సమగ్రత కోరుకొనే ప్రతీ ఒక్కరూ సీఏఏకు మద్దతు ఇవ్వాలి. సీఏఏ గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసి, దానిపై వారిలో నెలకొన్న అపోహలు, అనుమానాలు దూరం చేసేందుకు త్వరలోనే బిజెపి అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సభలు, సదస్సులు నిర్వహించనున్నము,” అని అన్నారు.