
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో గోపనపల్లి గ్రామంలో రూ.150 కోట్లు విలువైన 6 ఎకరాల భూములను రేవంత్ రెడ్డి సోదరులు నకిలీ పత్రాలతో తమ పేర్లపైకి బదిలీ చేయించుకున్నారని తెలంగాణ ప్రభుత్వం కేసు బనాయించడంపై రేవంత్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను 1978లో రికార్డులు తారుమారు చేసి 2005లో ఆ భూములు కొన్నట్లు ప్రభుత్వం నాపై కేసు పెట్టింది. 1978లో నా వయసు 6 సం.లే. ఆ వయసులో నేను ఏవిధంగా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయగలనో ప్రజలే ఆలోచించాలి. ఇక 2005లో నేను ఆ భూములు కొన్నట్లు ఆరోపిస్తున్నారు. అంటే 15 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ సంగతి మీకు గుర్తొచ్చిందా? కేసీఆర్ అధికారంలోకి వచ్చి అప్పుడే ఆరేళ్లు అవుతోంది. మరి ఇంతకాలం ఎందుకు ఊరుకొన్నారు? ఇక నాకోసం రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని చెపుతున్న తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి 2005లో ఎక్కడ పనిచేస్తున్నారో కేసీఆర్‌కు ఏమైనా తెలుసా?ఎప్పుడైనా ఎక్కడైనా మేకలనే బలిస్తారు తప్ప పులులను బలివ్వరు. ఈ వ్యవహారంలో కూడా అలాగే జరిగింది. పాపం అన్యాయంగా ఆయనను సస్పెండ్ చేశారు.
అయినా ప్రభుత్వం చెపుతున్న ఆ సర్వే నెంబరులో ఉన్న భూమి ప్రైవేట్ వ్యక్తులదే తప్ప ప్రభుత్వానిది కాదు. కనుక దానిని ఎవరైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు. అందులో ప్రభుత్వానికి అభ్యంతరం దేనికో నాకు అర్ధం కాదు. నేను ఇప్పటి వరకు గోపనపల్లి ఎక్కడుందో కూడా చూడలేదు. మరి నాకు అక్కడ భూములున్నాయంటే నమ్మశక్యంగా ఉందా?
సిఎం కేసీఆర్ చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను నేను నిలదీస్తున్నందుకే నాపై 64 కేసులు పెట్టారు. దీంతో కలిపి 65 అవుతాయి. అయితే ఈ కేసులకు భయపడి నేను వెనక్కుతగ్గుతానని సిఎం కేసీఆర్ అనుకొంటే అంతకంటే ఆవివేకం మరోటి ఉండదు. ఈ అక్రమకేసులు...ఎఫ్ఐఆర్లు అన్నీ సిఎం కేసీఆర్‌పై నేను చేస్తున్న పోరాటాలకు సర్టిఫికెట్స్..మెడల్స్ వంటివి. వాటితో నన్ను బదనామ్ చేయాలని సిఎం కేసీఆర్ అనుకొంటుంటే వాటితోనే నాకు ప్రజలలో, మా కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. నా ఈ పోరాటాలకు గుర్తుగా కేసీఆర్ అందిస్తున్న ఈ మెడల్స్ మా అధిష్టానం కూడా గుర్తిస్తోంది. కనుక ఈ కేసులతో కొంచెం ఇబ్బందే తప్ప నాకేదో నష్టం జరుగుతుందనుకోను.
సిఎం కేసీఆర్ ఎన్నికల హామీలను అమలుచేయకుండా ఇప్పుడు పట్టణ ప్రగతి అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని పేదప్రజలు చెపుతున్నారు. ఆ విషయమే ప్రజలందరికీ తెలియజేయాలని నేను ‘పట్నంగోస’ పేరుతో ప్రజల మద్యకు వెళ్ళడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారు. అందుకే నన్ను ఏవిధంగా అడ్డుకోవాలో తెలియక ఈ కేసు పెట్టారు.
కేసీఆర్‌కు తనను ప్రశ్నించేవారిని భయపెట్టి లొంగదీసుకోవడం అలవాటే. కేసీఆర్ అన్యాయాలను ప్రశ్నించినందుకు రవిప్రకాశ్‌పై అక్రమకేసులు పెట్టి టీవీ9ను రామేశ్వర్ రావు ద్వారా స్వాధీనం చేసుకొన్నాడు. ఇప్పుడు అదే అలవాటుతో నా ఆస్తులపై కూడా ఏవో లిటిగేషన్లు పెట్టి నన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే నా ఆస్తులన్నీ పోయినా తుదిశ్వాస విడిచేవరకు కేసీఆర్‌పై పోరాడుతూనే ఉంటాను.
పార్లమెంటు సమావేశాలు ముగియగానే సిఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, మైహోమ్ రామేశ్వర్ రావు తదితరులు చేసిన అక్రమాలను బయటపెడతాను. నమస్తే తెలంగాణలోకి ఏవిధంగా నిధులు వచ్చాయో అవి కేసీఆర్ కుటుంబ ఖాతాలలోకి ఏవిధంగా వెళ్లిపోయాయో అన్ని నాకు తెలుసు. వాటన్నిటినీ బయటపెట్టి సిఎం కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు చూపిస్తాను.
ఇక నేటికీ పిసిసి అధ్యక్ష పదవి ఖాళీగా లేదు. బలమైన నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉననరు. ఆయన నాయకత్వంలో అందరం సిఎం కేసీఆర్‌తో పోరాడుతూనే ఉంటాము. ఈ కేసు వలన మా పార్టీ అధిష్టానం నన్ను పక్కన పెడుతుందనుకోను. ఎందుకంటే, ఈ కేసులే నా పోరాటాలకు గుర్తింపని రాహుల్ గాంధీయే నాతో అన్నారు. కనుక పార్టీలో తగిన గుర్తింపు, సముచిత గౌరవం ఎప్పుడూ లభిస్తూనే ఉంది. ఇక ముందు కూడా లభిస్తుందని బలంగా నమ్ముతున్నాను,” అని అన్నారు.