
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో టిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేష్, శివ అనే వ్యక్తిపై ఈరోజు ఉదయం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించాడు. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికలలో వేములవాడ 3వ వార్డు నుంచి పోటీ చేసిన వెంకటేష్ స్వల్ప తేడాతో స్వతంత్ర అభ్యర్ధి దివ్య చేతిలో ఓడిపోయారు. తన ఓటమికి శివ కారణమని అనుమానించిన వెంకటేష్ అతనిపై పగ పెంచుకొన్నాడు. ప్రాణాలు తీస్తానంటూ పలుమార్లు శివను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే అతను కోపంతో తనను అలా బెదిరిస్తున్నాడే తప్ప అన్నంత పని చేస్తాడనుకోలేదు.
పోలీసులు వెంకటేష్, అతనికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.
సర్పంచ్, కౌన్సిలర్ వంటి చిన్న పదవులతో చాలామంది రాజకీయాలలో అడుగుపెడుతుంటారు. కనుక ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలితే నిరాశానిస్పృహలకు లోనవడం సహజమే. ఇప్పటికే ఒకసారి కౌన్సిలర్‌గా చేసిన వెంకటేష్ క్షణికావేశంలో ఈ హత్యకు పాల్పడి తన జీవితాన్నే తారుమారుచేసుకొన్నాడని చెప్పక తప్పదు.