ప్రధాని తెలంగాణ ప్రజలను అవమానించారు: గుత్తా

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రధాని నరేంద్రమోడీ, అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుసరించిన వైఖరి సరికాదంటూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తప్పు పట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలనే కాదు... ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణమద్దతు ఇచ్చిన బిజెపి నాయకురాలు స్వర్గీయ సుష్మాస్వరాజ్‌ను కూడా కించపరుస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఆనాడు పార్లమెంటులో బిజెపి కూడా మద్దతు ఇచ్చినందునే తెలంగాణ ఏర్పడిందని బిజెపి నేతలు గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, మళ్ళీ అది తప్పన్నట్లు ప్రధాని మాట్లాడటం ఏమిటి? ఇకనైనా బిజెపి ఇటువంటి ద్వంద వైఖరిని మానుకొంటే మంచిది. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు,” అని అన్నారు.