కేసీఆర్‌, కేటీఆర్‌లకు లక్ష్మణ్ సూటి ప్రశ్నలు

కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చేస్తున్న విమర్శలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఘాటుగా స్పందిస్తూ వారికి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. 

సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రబడ్జెట్‌పై కేసీఆర్‌, కేటీఆర్‌ స్పందన వారి అవగాహనారాహిత్యానికి అద్దం పడుతోంది. కేంద్రబడ్జెట్‌లో కేటాయింపులు రాష్ట్రాలవారీగా ఉండవనే సంగతి కేసీఆర్‌, కేటీఆర్‌లకు తెలియదా? కేంద్రం తెలంగాణను అన్యాయం చేసిందని విమర్శిస్తున్న కేసీఆర్‌, ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పగలరా? నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ఆదాయాన్ని పెరిగేలా చేశారు. కానీ సిఎం కేసీఆర్‌ 5 ఏళ్ళలోనే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. ఇప్పుడు తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రాన్ని నిందిస్తున్నారు. గత ఏడేళ్ళలో రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు విడుదల చేసిందో నేను నిరూపించగలను. దమ్ముంటే కేటీఆర్‌ నాతో బహిరంగ చర్చకు రావాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇవ్వడం లేదని విమర్శిస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌ మరి ఇంతవరకు దాని సమగ్ర నివేదిక (డిపిఆర్)కేంద్రానికి ఇవ్వలేదు? ఇస్తే దానిలో తాము చేసిన అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే కదా? కాళేశ్వరం ప్రాజెక్టులో కూడబెట్టిన అవినీతి సొమ్ముతో ఎన్నికలలో గెలుస్తూ కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రగల్భాలు పలుకుతున్నారు. వారికి బిజెపి దెబ్బ ఏవిధంగా ఉంటుందో 2023 అసెంబ్లీ ఎన్నికలలో రుచి చూపిస్తాం.  నిజామాబాద్‌, నేరేడుచర్ల, తుక్కుగూడలో టిఆర్ఎస్‌కు బలం లేకపోయినా అడ్డుగోలుగా పదవులు దక్కించుకొంది. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మళ్ళీ నీతులు, ధర్మపన్నాలు వల్లిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది” అని ఘాటుగా బదులిచ్చారు.