వాటితో చేతులు కలపం.. చేర్చుకొంటాం: కేటీఆర్‌

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొనేసరికి బిజెపి నేతలు ఎగిరెగిరి పడ్డారు. రాష్ట్రంలో వారికి బలం లేదని మేము చెపితే నమ్మలేదు. మునిసిపల్ ఎన్నికలలో బోర్లాపడితే కానీ వారికి ఆ విషయం అర్ధం కాలేదు. కాంగ్రెస్, బిజెపిలపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారు. అందుకే మునిసిపల్ ఎన్నికలలో ఆ పార్టీల నేతలు కొన్ని చోట్ల మాతో చేతులు కలిపేందుకు తహతహలాడారు కానీ వారితో చేతులు కలపవలసిన అవసరం మాకు లేదు. ఓటమి భయంతో ఆ రెండు పార్టీలే నిసిగ్గుగా చేతులు కలిపాయి. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది కనుకనే ప్రజలు టిఆర్ఎస్‌ను ఆదరిస్తున్నారు. అందుకే ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు మా పార్టీలో చేరుతున్నారు, ” అని అన్నారు. 

కేంద్రబడ్జెట్‌పై స్పందిస్తూ, “తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో ఒక్కపైసా విదిలించలేదు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల గొప్పదనాన్ని నీతి ఆయోగ్ గుర్తించి వాటికి నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేసినా కేంద్రం పైసా విదిలించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని అడుగుతుంటే పట్టించుకోలేదు. హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌, హైదరాబాద్‌-వరంగల్‌ మద్య ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు నిధులు విడుదల చేసి సహకరించాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీనిపై కె.లక్ష్మణ్‌, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, నలుగురు ఎంపీలు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. 

బిజెపికి ఎంతసేపు హిందూ ముస్లిం, లేదా భారత్‌, పాకిస్థాన్‌ గొడవే తప్ప దేశాభివృద్ధి పట్టదు. కేంద్రపన్నుల ఆదాయంలో న్యాయంగా రాష్ట్రానికి రావలసిన పన్నుల వాటాను కూడా కేంద్రం సరిగ్గా చెల్లించడం లేదు. రాష్ట్ర బిజెపి నేతలకు, ఎంపీలకు దమ్ముంటే డిల్లీ వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రానికి ఏమీ చేయకుండా ప్రజలను అడిగితే వేస్తారా?” అని అన్నారు.