
హైదరాబాద్-ముంబైతో సహా దేశంలో ప్రధాన నగరాల మద్య ఆరు హైస్పీడ్ రైళ్లు నడిపించడానికి రైల్వేశాఖ సర్వే చేయిస్తోంది. రైల్వేబోర్డు ఛైర్మన్ వికె యాదవ్ బుదవారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఆరు హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైళ్లు నడిపించడానికి ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. వాటిపై ఈ ఏడాది డిసెంబరులోగా సమగ్ర నివేదికలు సిద్దం అవుతాయి. ఆలోగా ఈ ఆరు ప్రాజెక్టులకు భూసేకరణ కార్యక్రమం పూర్తి చేస్తాము. సమగ్ర నివేదికల ఆధారంగా వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు చేసి పనులు ప్రారంభిస్తాము. హైస్పీడ్ రైళ్ళు గంటకు 300కిమీ వేగంతో, సెమీ హైస్పీడ్ రైళ్ళు గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. ముంబై–పుణే–హైదరాబాద్, ముంబై–నాసిక్–నాగ్‌పూర్, చెన్నై–బెంగళూరు–మైసూర్, ఢిల్లీ–జైపూర్–ఉదయ్‌పూర్–అహ్మదాబాద్, ఢిల్లీ–నోయిడా–ఆగ్రా–లక్నో–వారణాసి, ఢిల్లీ–లూథియానా–జలంధర్–అమృత్‌సర్‌ల నగరాల మద్య ఈ హైస్పీడ్ రైళ్ళు నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి,” అని చెప్పారు.