రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావుడి

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు హడావుడి ముగియగానే సహకారసంఘాల ఎన్నికల హడావుడి మొదలవుతోంది. తక్షణమే సహకారసంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసి రెండువారాలలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను బుదవారం ఆదేశించారు. కనుక రెండు మూడు రోజులలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. 

 రాష్ట్రంలో 584 మండలాలకు 906 సహకారసంఘాలున్నాయి. వాటన్నిటి గడువు 2018లోనే ముగిసిపోయినప్పటికీ అనివార్య కారణాల వలన ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. కనుక ప్రభుత్వం వాటికి ‘పర్సన్ ఇన్-ఛార్జ్’లను నియమించింది. వారి పదవీకాలం ముగుస్తుండటంతో మళ్ళీ పొడిగించకుండా ఎన్నికలు నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రభుత్వం మండలాలను పునర్వ్యవస్థీకరించడంతో రాష్ట్రంలో కొత్తగా 86 మండలాలు ఏర్పడ్డాయి. కనుక ఒక్కో మండలాన్ని యూనిట్‌ చొప్పున కనీసం రెండు సహకారసంఘాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని 670 మండలాలకు మొత్తం 1,340 సహకారసంఘాలు ఏర్పాటుచేసి వాటన్నిటికీ త్వరలో ఎన్నికలు నిర్వహించబోతోంది.