
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బుదవారం బిజెపిలో చేరారు. ఈరోజు ఉదయం ఆమె డిల్లీలోని బిజెపి కార్యాలయం చేరుకొని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. అనంతరం ఆమెకు పార్టీ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ ఆమెకు బిజెపి సభ్యత్వ రశీదును అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నాకు కష్టపడి పనిచేసేవారంటే చాలా ఇష్టం. అందుకే దేశం కోసం, క్రీడాభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్న ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో పనిచేయాలనే ఆకాంక్షతో బిజెపిలో చేరాను. పార్టీ ఆదేశానుసారం పనిచేస్తాను,” అని అన్నారు.
సైనా నెహ్వాల్ ఇప్పటి వరకు మొత్తం 20సార్లు అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొని టైటిల్స్ గెలుచుకున్నారు. 2009లో వరల్డ్ నంబర్ 2 స్థానంలో ఉన్న సైనా 2015లో వరల్డ్ నంబర్ వన్ స్థానానికి ఎదిగారు. కానీ ప్రస్తుతం సైనా 9వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఒకప్పుడు సినీతారలు ఎక్కువగా రాజకీయాలలోకి వచ్చేవారు. ఆ తరువాత వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు చేరేవారు. ఇప్పుడు క్రీడాకారులు వచ్చి చేరుతున్నారు. గత ఏడాది గౌతమ్ గంభీర్, బాబితా ఫోగట్ బిజెపిలో చేరగా ఇప్పుడు సైనా నెహ్వాల్ చేరారు.