
సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పడిన నేరేడుచర్ల పురపాలకసంఘానికి ఈరోజు ఛైర్మన్‌ను ఎన్నుకోవలసి ఉంది. కానీ ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాలతో ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదాపడింది. నేరేడుచర్ల పురపాలకసంఘంలో మొత్తం 15 వార్డులు ఉండగా వాటిలో టిఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7, సిపిఎం 1 స్థానంలో గెలిచాయి. కనుక ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి టిఆర్ఎస్ బలం 10కి చేరింది. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఒక సిపిఎం కౌన్సిలర్‌తో కలిపి కాంగ్రెస్ పార్టీ బలం కూడా 10కి చేరింది.
అయితే కేవీపీ రామచంద్రరావు పేరును ఎక్స్అఫీషియోగా నమోదుచేసేందుకు నేరేడుచర్ల రిటర్నింగ్ అధికారి నిరాకరించడంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే దాని వలన ప్రయోజనం ఉండదని గ్రహించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెంటనే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిస్థితి వివరించడంతో ఆయన కేవీపీ రామచందర్‌రావు పేరును ఎక్స్అఫీషియోగా చేర్చవలసిందిగా ఆదేశించారు. దాంతో కాంగ్రెస్, టిఆర్ఎస్ల బలాబలాలు మళ్ళీ సరిసమానం అయ్యాయి.
కానీ కేవీపీ రామచందర్‌రావు పేరును ఎక్స్అఫీషియోగా చేర్చడాన్ని తప్పుపడుతూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మునిసిపల్ కార్యాలయంలో ఆగ్రహంతో చిందులు వేశారు. మైకును విరగొట్టి, పేపర్లను చించివేసి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. తొలిసమావేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.