గవర్నర్‌ తమిళిసై నిర్ణయంతో తెరాస సర్కార్‌కు ఇబ్బంది

తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పనిచేసి వచ్చిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. కనుక గవర్నర్‌కు ప్రభుత్వానికి మద్య సత్సంబందాలే ఉన్నాయి. అయితే ఆమె తాజా నిర్ణయంతో ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యేలా ఉన్నాయి. త్వరలోనే ఆమె రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ పేరిట సామాన్యప్రజలతో సమావేశం కానున్నారు. ఆ సమావేశాలలో ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారు ఇచ్చే వినతి పత్రాలను స్వీకరించి ప్రభుత్వంలో సంబందిత శాఖలకు పంపిస్తారు. వాటిపై అధికారులు చర్యలు తీసుకొన్నారో లేదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా తయారుచేయిస్తున్నట్లు తెలుస్తోంది. దానిని అన్ని ప్రభుత్వశాఖలతో అనుసంధానం చేయించి, ఎప్పటికప్పుడు వినతి పత్రాలపై ప్రభుత్వ శాఖలు ఎటువంటి చర్యలు తీసుకొన్నాయో గమనిస్తుంటారు. 

రాష్ట్రాలలో కేంద్రప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించే గవర్నర్‌ ప్రభుత్వశాఖలలో ఈవిధంగా జోక్యం చేసుకోవడం, అవసరమైతే ఒత్తిడి చేయడం రాజ్‌భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మద్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది. కనుక ఈ ఆలోచన విరమించుకొంటే మంచిదని తెరాస సర్కార్‌ కోరుకోవడం సహజమే. కానీ అందుకు గవర్నర్‌ అంగీకరించకపోవచ్చు. కనుక సమస్య మొదలైనట్లే భావించవచ్చు.