కాంగ్రెస్‌ విజన్...తెరాస కౌంటర్

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ గురువారం గాంధీభవన్‌లో మునిసిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. దానిలో భాగంగా 500 చదరపు గజాలలోపు స్థలాలు ఉన్న ప్రతీ ఇంటికి ఇంటి పన్ను రద్దు చేస్తామని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా నల్లా కనెక్షన్ ఇస్తామని, పేదలకు రూ.5లకే మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తామని, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తామని, కొత్తగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి, వ్యర్ధాల నిర్వహణకు ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మొత్తం 24 హామీలతో కూడిన ఆ మ్యానిఫెస్టోను వారు కాంగ్రెస్‌ విజన్ డాక్యుమెంట్‌గా అభివర్ణించారు.

దీనిపై తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెంటనే స్పందిస్తూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదెప్పుడు...ఆ మ్యానిఫెస్టోలో హామీలను అమలుచేసేదెప్పుడు? అయినా అసలు విజన్ (దూరదృష్టి)లేని కాంగ్రెస్ పార్టీ తాను ఎన్నడూ అమలుచేయని, చేయలేని విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలలో దాదాపు అన్నిటినీ మా ప్రభుత్వం ఇప్పటికే అమలుచేస్తోంది. కనుక కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేసేదేముంది?ఇక మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు బిజెపికి అభ్యర్ధులే దొరకనప్పటికీ ఆ పార్టీ నేతలు చాలా గొప్పలు చెప్పుకొంటుండటం హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు.