
ఈనెల 22న జరుగబోయే మునిసిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తెరాస పూర్తిస్థాయిలో సిద్దంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్, బిజెపి నేతలు చెపుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో ఆ పార్టీల పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. తెరాసను ఎదుర్కోవడం సంగతి అటుంచి అనేక వార్డులలో ఆ రెండు పార్టీల తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా దొరకలేదంటే వాటి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో తెరాసలో బీ ఫారంల కోసం అనేకమంది పోటీ పడ్డారంటే మా పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని అర్ధమవుతోంది. కాంగ్రెస్, బిజెపి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె.లక్ష్మణ్ ఇద్దరూ ఎంత మొత్తుకొన్నా మునిసిపల్ ఎన్నికలలో గెలిచేది మేమే. ఎందుకంటే, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయితీలు, మునిసిపాలిటీలు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణ చేసి ప్రజల ముంగిటికే పాలన తీసుకువచ్చాము. అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేసి చూపించాము. ఒకప్పుడు కార్పొరేషన్ అంటే జీహెచ్‌ఎంసీ, ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్ చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 10 మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రతీ జిల్లాలో.. ప్రధాన పట్టణాలలో ఒక ట్యాంక్ బండ్ నిర్మిస్తున్నాము. గ్రామాలు, పట్టణాలు అన్ని పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నాము. తెలంగాణలో కనబడుతున్న ఈ మార్పులన్నిటినీ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు కనుక మునిసిపల్ ఎన్నికలలో తెరాసను గెలిపించడం ఖాయం,” అని అన్నారు.