
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతుల చేసిన పోరాటాలు ఎట్టకేలకు ఫలించాయి. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే అది కేవలం పసుపు బోర్డుగా కాకుండా పసుపు, సుగంధ ద్రవ్యాల ప్రమోషన్ హబ్‌గా ఏర్పాటు చేయబోతోంది. దీనిలో పసుపుతో పాటు టీఐఈఎస్ పథకం కింద ఇతర సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులకు సంబందించిన పంటల అభివృద్ధి, వాటి మార్కెటింగ్ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించేవిధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఎన్నికలు పూర్తవగానే ఈ పసుపు-సుగంధ ద్రవ్యాల హబ్ ఏర్పాటుకు సంబందించి కేంద్రప్రభుత్వం అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వం భారీగా నిధులు విడుదలచేయనున్నట్లు తాజా సమాచారం.
జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాననే హామీతో లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్, “పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కానీ పసుపు రైతులకు అంతకంటే ఎక్కువ మేలు కలిగే విధానం అమలులోకి తీసుకురాబోతున్నట్లు” కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కనుక కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఈ పసుపు-సుగంధ ద్రవ్యాల హబ్ నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు కోరుకొన్నట్లే ఉంటుందా లేదా? అనే విషయం అధికారిక ప్రకటన వెలువడితే కానీ తెలియదు.