నేడు ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శుల సమావేశం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నీలం సహానీ, సోమేష్ కుమార్ నేడు విజయవాడలో సమావేశం కానున్నారు. మూడు రోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశమైనప్పుడు చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న షెడ్యూల్ 9,10 లోని సంస్థల పంపకాల సమస్యలపై చర్చించి  పరిష్కరించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కనుక ఈ అంశంపై తక్షణం సమావేశమయ్యి చర్చించాలని తమ తమ ప్రధాన కార్యదర్శులకు అదే సమయంలో వారిరువురూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నేడు వెలగపూడి సచివాలయంలో సమావేశం కానున్నారు.