1.jpg)
మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి శంఖారావం పూరించారు. మేడ్చల్‌లోని నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగసభ నిర్వహించింది. మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ సభలో రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని తెరాస ఇంతవరకు నెరవేర్చలేదు. పైగా ఆర్టీసీ, మద్యం ధరలు పెంచేసింది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికలలో తెరాసను గెలిపిస్తే ఇంటి పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచడం ఖాయం. నాగారం, దమ్మాయిగూడలో డంపింగ్ యార్డువలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిని తరలించాలని కోరుతున్నా మంత్రి మల్లారెడ్డి పట్టించుకోవడంలేదు. ఎందుకంటే ఆయనకు సిఎం కేసీఆర్ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం లేదు. తెరాస నేతలు కనీసం స్థానిక సమస్యలు కూడా పరిష్కరించలేనప్పుడు వారికి ఎందుకు ఓట్లు వేసి గెలిపించాలి?అని ప్రజలందరూ ఆలోచించాలి. ప్రజల పక్షాన్న నిలబడి సమస్యలపై పోరాడేది కాంగ్రెస్ పార్టీయే. కనుక కాంగ్రెస్ అభ్యర్ధులకే ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.