హైదరాబాద్‌ పోలీసులు...మరో కొత్త ఆలోచన

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర పోలీస్ శాఖలో పెనుమార్పులు వచ్చాయి. పెట్రోలింగ్ కోసం పోలీసులకు మంచి వాహనాలు, ఎక్కడికక్కడ సిసి కెమెరాలు, రాష్ట్రంలో అన్ని పోలీస్‌స్టేషన్లను ఇంటర్నెట్‌తో అనుసంధానించడం వంటి అనేకమార్పులు వచ్చాయి. 

గతంలో పోలీసులకు, ప్రజలకు మద్య చాలా దూరం ఉండేది. ప్రజల సహకారం ఉంటేనే సమాజంలో నేరాలను అదుపు చేయడంలో...కేసుల పరిష్కారంలో పోలీసుల పని సులువవుతుందని గ్రహించిన రాష్ట్ర పోలీస్ శాఖ, కమ్యూనిటీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే రెండు కొత్త విధానాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తోంది. 

దానిలో భాగంగానే హైదరాబాద్‌ పోలీసులు బాధితుల ఇళ్ళవద్దకే వెళ్ళి పిర్యాదులు స్వీకరించి, అవసరమైతే అక్కడే ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేసే సరికొత్త విధానాన్ని ప్రారంభించారు. నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ సోమవారం ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు. మొదటిరోజునే నగరంలో చిక్కడ్‌పల్లి, డబీర్‌పురా, మారేడ్‌పల్లి మార్కెట్, ఛత్రినాక, ఫలక్‌నూమా పోలీస్‌స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ సిబ్బంది భాదితుల ఇళ్ళవద్దకు వెళ్ళి పిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడ కేసులు నమోదు చేశారు. ఈవిధంగా మొదటిరోజునే మొత్తం 10 కేసులు నమోదు చేశారు. 

గతంలో బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగవలసివచ్చేది. ఆ సందర్భంగా పోలీస్‌స్టేషలలో నిరాధారణ, అవమానకర పరిస్థితులు కూడా ఎదుర్కోవలసివస్తుండేది. కానీ ఇప్పుడు పోలీసులే స్వయంగా భాదితుల ఇళ్ళకు వచ్చి ఫిర్యాదులు స్వీకరిస్తుండటంతో ఆ ఇబ్బందులు తప్పుతాయి. పైగా పోలీసులు బాధితుల ఇళ్ళకు వస్తే నేరస్తులలో భయం ఏర్పడుతుంది కూడా. కనుక ఈ కొత్త విధానం కూడా సత్ఫలితాలు ఈయవచ్చు. ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి ఆలోచనలతో ముందుకు సాగుతున్న మన పోలీస్ శాఖకు అభినందనలు.