
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 123 మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఆదివారం రిజర్వేషన్లు ప్రకటించింది. మొత్తం అన్ని పదవులలో 50 శాతం మహిళలకు కేటాయించబడింది. దాని ప్రకారం రాష్ట్రంలో 61 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో చైర్మన్, మేయర్ పదవులు మహిళలకు దక్కనున్నాయి.
చైర్మన్, మేయర్ పదవులలో 33 శాతం పదవులు బీసీలకు కేటాయించింది. దాని ప్రకారం బీసీలకు నాలుగు కార్పొరేషన్లలో మేయర్ పదవులు, 60 మున్సిపాలిటీలలో ఛైర్మన్ పదవులు లభిస్తాయి.
ఎస్సీలకు 17, ఎస్టీలకు 4, జనరల్ 62 మున్సిపాలిటీలు, మీర్పేట మేయర్ పదవి ఎస్టీకి, రామగుండం మేయర్ పదవి ఎస్సీకి కేటాయించబడ్డాయి.
జడ్చర్ల, నకిరేకల్, పాల్వంచ, మందమర్రి, మణుగూరులకు వేర్వేరు కారణాల చేత ఇంకా రిజర్వేషన్లు కేటాయించలేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ టికె. శ్రీదేవి తెలిపారు. కార్పొరేషన్లలో ఎస్సీలు 3.6, ఎస్టీలు 1.9 శాతం ఉన్నందున తదనుగుణంగానే రిజర్వేషన్లు ఖరారు చేశామని తెలిపారు. ఈ రిజర్వేషన్లను కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఖరారు చేసినందున వచ్చే ఎన్నికలలో కూడా ఇవే వర్తిస్తాయని తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్నాయి. ఈ స్థానాన్ని (జనరల్) మహిళలకు కేటాయించామని తెలిపారు. ఖమ్మం, నిజాంపేట, బడంగ్పేట్ కార్పొరేషన్లు కూడా మహిళలకే కేటాయించమని తెలిపారు.
ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి కనుక వాటికి అనుగుణంగా అన్ని పార్టీలు తమ అభ్యర్ధులను ఖరారు చేసుకొని బుదవారం నుంచి నామినేషన్లు వేయవచ్చు. అయితే రిజర్వేషన్ల ప్రకటనకు-నామినేషన్లు వేయడానికి మద్య కేవలం రెండు రోజులే ఉండటం వలన రిజర్వేషన్లపై అభ్యంతరాలు తెలియజేయడానికి, అభ్యర్ధులను ఎంపిక చేసుకోవడానికి, ఎంపికైన అభ్యర్ధులు నామినేషన్లకు అవసరమైన ధృవపత్రాలు సిద్దం చేసుకోవడానికి సమయం సరిపోదని కనుక తగినంత సమయం ఇచ్చేందుకు వీలుగా ఎన్నికల షెడ్యూల్ మార్చాలని కోరుతూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై నేడు హైకోర్టు విచారణ జరుపనుంది. కానీ ఈ దశలో ఎన్నికలను వాయిదావేయడానికి హైకోర్టు అంగీకరించకపోవచ్చు.