బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ నేటి నుంచి పునః ప్రారంభం

హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ నేటి నుంచి ప్రజలు వినియోగించుకోవచ్చు. నవంబర్ 23న ఆ వంతెనపై ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి క్రిందపడినప్పుడు ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ వంతెనను మూసివేసి, నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రమాదనివారణలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అవి పూర్తవడంతో మేయర్ బొంతు రామ్మోహన్, సిపి సజ్జనార్ శనివారం ఉదయం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రయాణించి దానిపై చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన తరువాత ఫ్లైఓవర్‌ను తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. నేటి నుంచి నెలరోజులు వంతెనపై వాహనాలు ప్రయాణిస్తున్న తీరును నిశితంగా గమనించిన తరువాత అవసరమైతే ఇంకా అదనపు భద్రతా ఏర్పాట్లు పెంచుతామని తెలిపారు.