తెరాస నేతలతో రేపు కేసీఆర్‌ విందు సమావేశం

సిఎం కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాస్థాయి నేతలతో తెలంగాణ భవన్‌లో విందుభోజనం చేయనున్నారు. అనంతరం వారితో సుదీర్గంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ముఖ్యోద్దేశ్యం మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే అయినప్పటికీ, మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు, వాటి నుంచి ఆశిస్తున్న ఫలితాల గురించి సిఎం కేసీఆర్‌ తెరాస నేతలకు వివరించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పధకాల గురించి వారికి వివరించి వాటి గురించి అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది.  ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాలను ఏవిధంగా ప్రజలలోకి తీసుకువెళ్ళాలో కూడా వివరించబోతున్నట్లు తెలుస్తోంది.

తెరాస నేతలు, కార్యకర్తల మద్య సమన్వయం కొరవడటం కారణంగానే లోక్‌సభ ఎన్నికలలో 7 సీట్లు కోల్పోయామని భావిస్తున్న సిఎం కేసీఆర్‌ త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో అటువంటి సమస్య తలెత్తకుండా ఏవిధంగా ముందుకు సాగాలో తెరాస శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇవన్నీ చర్చించేందుకు సాయంత్రం వరకు సమావేశం కొనసాగవచ్చు కనుక తెరాస నేతలందరికీ సిఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో విందుభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 11.30 గంటలకు తెరాస సమావేశం మొదలవుతుంది.