దేశానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామరక్ష: పొన్నం

టీపీసీసీ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాతో సహా ఎవరున్నా వెళ్ళిపోయినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జీవనది వంటిది. బిజెపి, తెరాస, మజ్లీస్ పార్టీలు పైకి వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ ఆ మూడు ఒక్కటే. బిజెపి దేశంలో మతవిద్వేషాలు రగిల్చి ప్రజల మద్య చిచ్చుపెడుతోంది. తెరాస, మజ్లీస్ పార్టీలు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలదు. కనుక కాంగ్రెస్ పార్టీయే దేశానికి శ్రీరామరక్షవంటిది. 

మున్సిపల్ ఎన్నికల కోసం బలమైన అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నాము. కనుక ఈసారి కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. మున్సిపల్ ఎన్నికలలో ప్రతిపక్షలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందని మంత్రి గంగుల కమలాకర్ మాటలకు ఆంతర్యం ఏమిటి? ప్రతిపక్ష సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని చెపుతున్నారా?నిజానికి కాంగ్రెస్‌ హయాంలోనే దేశంలో, తెలంగాణలో అభివృద్ధి జరిగింది. కరీంనగర్‌ను లండన్, న్యూయార్క్ నగరాలలాగా మార్చేస్తామని గొప్పలు చెప్పిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు వేములవాడ దగ్గరున్న నీటిని చూపించి అదే అభివృద్ధి అనుకొమ్మంటున్నారు. కరీంనగర్‌ అభివృద్ధిపై మంత్రి గంగుల కమలాకర్ బహిరంగచర్చకు సిద్దామేనా?” అని పొన్నం ప్రభాకర్‌ సవాలు విసిరారు.