ఆర్టీసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు

టీఎస్‌ఆర్టీసీలో యూనియన్ల స్థానంలో సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలనే సిఎం కేసీఆర్‌ సూచన మేరకు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్రంలో అన్ని డిపోల నుంచి డిపోకు ఇద్దరు చొప్పున మొత్తం 202 మంది ఆర్టీసీ కార్మికులతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. ప్రతీనెలకు ఒకసారి డిపో మేనేజర్ డిపోలో బోర్డు సభ్యులతో సమావేశమవుతుంటారు. అలాగే ప్రతీ రెండు నెలలకోసారి హైదరాబాద్‌లో బోర్డు సభ్యులతో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. 

ప్రతీ డిపోలో ఒక ఈ-బాక్స్ ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లవచ్చు. అలాగే ఆర్టీసీ అభివృద్ధిపధంలో నడిపించేందుకు ఏవైనా సలహాలు, సూచనలు కూడా ఈ-బాక్స్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు. ఈ చర్యలు ఫలిస్తే ఆర్టీసీ కార్మికులు-యాజమాన్యం మద్యన ధృడమైన బందం ఏర్పడి పరస్పర అవగాహన పెరుగుతుంది కనుక ఆర్టీసీ లాభాలబాటలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. కానీ ఆర్టీసీ అధికారులు, కార్మికులు ఇరువర్గాలు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే సత్పలితాలు వస్తాయి.