
మున్సిపల్ ఎన్నికలపై స్టే విధించాలని కోరుతూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుదవారం హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ వేశారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వార్డుల విభజన, రిజర్వేషన్లు తదితర అంశాలపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు డిసెంబర్ 16వ తేదీలోగా ఆ ప్రక్రియ ముగించాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కమీషనర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఆ ప్రక్రియ పూర్తి చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 17న తుది నోటిఫికేషన్లు జారీచేసింది. దాని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 23న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించేసింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి ఓటర్ల జాబితా సిద్దం కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేయలేదు. జనవరి 6న రిజర్వేషన్లు ప్రకటించి 8 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ప్రకటించింది. రిజర్వేషన్లను పరిశీలించుకొని వాటిపై ఏవైనా అభ్యంతరాలున్నా అప్పీలు చేసుకోవడానికి వీలుపడదు. ఒకవేళ ఆ రిజర్వేషన్ల ప్రకారమే పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసుకోవాలన్నా రెండు రోజుల సమయం సరిపోదు.
రాజ్యాంగబద్దంగా...ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఇన్ని లోపాలతో హడావుడిగా నిర్వహించడం సరికాదు. కనుక ముందుగా ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి, రిజర్వేషన్లు ప్రకటించిన వారం రోజుల తరువాత నామినేషన్లు వేసుకొనేందుకు వీలుగా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేయాలి. కనుక అంతవరకు ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు.