నేడు తెలంగాణ భవన్‌లో తెరాస నేతల భేటీ

వచ్చే నెల జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు తెరాస నేతలు ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంద సంఘాల అధ్యక్షులు హాజరవుతారు. సిఎం కేసీఆర్‌ సూచించినవిధంగా తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురవేయాలనే ఏకైక లక్ష్యంగా తెరాస వ్యూహాలను సిద్దం చేసుకోబోతోంది.

జనవరి 6వ తేదీన వార్డుల రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. జనవరి 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. కనుక రెండు రోజులలోగా అన్ని జిల్లాలకు అభ్యర్ధులను ఖరారు చేయవలసి ఉంటుంది. కానీ తెరాసతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలకు వార్డుల రిజర్వేషన్లపై ఇప్పటికే కొంత అవగాహన ఉంది కనుక వాటిని బట్టి ముందుగానే అభ్యర్ధులను నిర్ణయించుకోగలవు. కనుక తెరాస కూడా నేటి సమావేశంలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కనుక ఇక ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టవచ్చు. కనుక ప్రచార వ్యూహాలు, ఏర్పాట్ల గురించి కూడా నేటి సమావేశంలో చర్చించనున్నారు. 

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ ఎన్నికల కోసం ఎదురుచూస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఎన్నికలొస్తే ప్రతిపక్షాలు తలలు పట్టుకొంటాయి. అధికారంలో ఉన్న తెరాస ఎన్నికల గంట మ్రోగక మునుపే రంగంలో దిగిపోతుంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇంతవరకు కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలు మున్సిపల్ ఎన్నికల గురించి ఆలోచించనే లేదు. అన్నిటికంటే ముందు తెరాస నేడు సమావేశమవుతోంది.