
ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకత ఏమిటంటే దేశంలో ఆయనను వ్యతిరేకించేవారు ఎంతమంది ఉన్నారో అభిమానించేవారు కూడా అంతేమంది ఉండటం. ఆయన నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంటారని, అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశం ఆర్ధిక, పారిశ్రామిక రంగాలు దెబ్బ తింటున్నాయని, దేశప్రజల మద్య విభేదాలు పెరుగుతున్నాయని విమర్శించేవారు కొన్ని కోట్లమంది ఉన్నారు. మోడీ ప్రభుత్వం అమలుచేయాలనుకొంటున్న సీఏఏ, ఏనార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలే అందుకు తాజా నిదర్శనం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దశాబ్ధాలపాటు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను ప్రధాని నరేంద్రమోడీ కేవలం ఈ ఆరేళ్ళలోనే చేసి చూపుతున్నందుకు ఆయనను అభిమానించేవారు దేశంలో కోట్ల మంది ఉన్నారు.
పెద్దనోట్లు రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు బెడిసికొట్టినా పాక్ భూభాగంలోకి మన సైనికులను పంపించి సర్జికల్ స్ట్రైక్స్ చేయించడం, మళ్ళీ వాయుసేనను పంపించి బాలాకోట్‌లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయించడం, జిఎస్టీ అమలు, ట్రిపుల్ తలాక్ నిషేదించడం, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి వేర్పాటువాదులను సమర్ధంగా అణచివేయడం, దశాబ్ధాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని సమరస్యంగా పరిష్కరించడం, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తుండటం, దేశంలో 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడం, భారీ ఎత్తున రహదారులు, కొత్తగా రైల్వే ట్రాకులు నిర్మిస్తుండటం, మౌలికవసతుల అభివృద్ధి చేస్తుండటం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తుండటం, స్వచ్చాభారత్, ఆయుష్మాన్ భారత్ వంటి అనేకానేక విన్నూత్న పధకాలతో దేశంలో మారుమూల ప్రాణాతలలో నివశిస్తున్న ప్రజలకు కూడా లబ్ధి కలిగించడంవంటివి దేశప్రజలలో ప్రధాని నరేంద్రమోడీకి ఎనలేని గౌరవం, కీర్తిప్రతిష్టలు కల్పించాయి. కనుకనే ఆయన చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొంటూ అమలుచేయగలుగుతున్నారని చెప్పవచ్చు.
తమిళనాడులోని తిరుచురాపల్లిలోని ఏరకుడి గ్రామానికి చెందిన పి.శంకర్ అనే ఒక రైతు కూడా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలతో లబ్ది పొందాడు. దాంతో అతను తన పొలంలో ప్రధాని నరేంద్రమోడీకి గుడి కట్టించి ప్రతీరోజూ ఆయన విగ్రహానికి పూజలు చేస్తున్నాడు. దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తూ ప్రపంచదేశాలలో భారత్ కీర్తిప్రతిష్టాలను మారుమ్రోగేలా చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ అంటే తనకు చాలా అభిమానమని తన జీవితంలో వెలుగులు నింపిన ప్రధాని నరేంద్రమోడీ తనకు దేవుడితో సమానమని అని చెపుతున్నాడు. అందుకే తన పొలంలోనే రూ.1.20 లక్షలు ఖర్చు పెట్టి ప్రధాని నరేంద్రమోడీకి గుడి కట్టించి రోజూ పూజలు చేస్తున్నానని శంకర్ చెప్పాడు.
బిజెపి నేతలు, కార్యకర్తలు మోడీ భజన చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ తమిళనాడులో ఓ మారుమూల గ్రామంలో నివాసం ఉంటున్న ఓ నిరుపేద రైతు హృదయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇంత గొప్ప స్థానం సంపాదించుకోవడమే విశేషం.