మున్సిపల్ ఎన్నికలు తాజా అప్‌డేట్స్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందా? అనే సందేహాలు వ్యక్తం అవుతుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ వి.నాగిరెడ్డి దీనిపై వివరణ ఇచ్చారు. ఎన్నికలు జరుగుతున్న పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది తప్ప రాష్ట్రంలో మిగిలిన పట్టణాలు, గ్రామాలకు కోడ్ వర్తించదని తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ పధకాల గురించి ప్రచారం చేయరాదని, ఓటర్లను ప్రభావితం చేసే కొత్త సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించరాదని, ప్రజాప్రతినిధులు ఎవరూ అధికారిక కార్యక్రమాలలో పాల్గొనరాదని ఎన్నికల సంఘం కమీషనర్ వి.నాగిరెడ్డి సూచించారు. 2019, జనవరి 1వ తేదీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ ఎన్నికల ఓటర్ల జాబితా ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి చర్చించడానికి ఈనెల 28న రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 

ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల ఖర్చు, డిపాజిట్ల గురించి కూడా కమీషనర్ వి.నాగిరెడ్డి వివరించారు.

ఎన్నికల ప్రచార వ్యయం: 

కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్ధులు ఎన్నికల వ్యయం గరిష్టంగా రూ. 1.5 లక్షలకు మించరాదు. 

మున్సిపాలిటీలలో అభ్యర్ధులు ఎన్నికల వ్యయం గరిష్టంగా ఒక లక్షకు మించరాదు.  

సెక్యూరిటీ డిపాజిట్లు: 

 కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్ధులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు రూ.2,500 డిపాజిట్ చెల్లించాలి. 

 మున్సిపాలిటీలలో అభ్యర్ధులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు రూ.1,250 డిపాజిట్ చెల్లించాలి.